: ఇటలీలో అఖిల్, శ్రియాల వివాహం... త్వరలోనే అధికారిక ప్రకటన!
అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఇటలీలో జరిపేందుకు నిర్ణయించినట్టు ఫిలిం నగర్ వర్గాలు వెల్లడించాయి. ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్న శ్రియా భూపాల్ తో అఖిల్ పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిని ఇటలీలో జరిపించేందుకు నిశ్చయించిన నాగార్జున, వివాహ వేదిక ఖరారుపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. 'అఖిల్' చిత్రం పరాజయం తరువాత సుదీర్ఘ విరామం తీసుకుని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేసేందుకు అఖిల్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తన అన్న నాగచైతన్య, హీరోయిన్ సమంతల పెళ్లి కన్నా ముందే అఖిల్ ఓ ఇంటివాడు కానున్నాడని గతంలోనే వార్తలు రాగా, ఘనంగా పెళ్లిని జరిపించేందుకు అక్కినేని కుటుంబం ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.