: ప్రజలు ఓట్లు వేయకపోయినా కొన్ని రాజకీయ పార్టీలు కొనసాగుతున్నాయి: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... పార్టీలో కార్యకర్తలు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తారని అన్నారు. పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళతారని చెప్పారు. ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తే తమకు న్యాయం జరుగుతుందని ఆలోచించి ఓటేస్తారని అన్నారు. ఏ రాజకీయ పార్టీ తమ కష్టాలు తీరుస్తుందో వారి పట్లే మక్కువ చూపుతారని చెప్పారు. అయితే, ప్రజలు ఓట్లు వేయకపోయినా కొన్ని పార్టీలు అలాగే కొనసాగుతున్నాయని అన్నారు. అలాంటి పార్టీలు పేపర్లు పెట్టుకుని, టీవీలు పెట్టుకుని తమ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాయని అన్నారు. దివంగత ఎన్టీఆర్ పార్టీలో కార్యకర్తలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారని చంద్రబాబు అన్నారు. కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు ఎప్పటినుంచో కొనసాగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్థిరమైన పునాదులపై ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు. మంచి వ్యక్తిత్వం నీతి, నిజాయతీ ముఖ్యమని చెప్పారు. ప్రజలకు టీడీపీ సిద్ధాంతాలను గురించి తెలియజెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజకీయాలు పవిత్ర భావంతో చేయాలని, సమాజమే దేవాలయం.. పేదవారే దేవుళ్లని ఎన్టీఆర్ చెప్పిన వ్యాఖ్యలే స్ఫూర్తిగా ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యకర్తలు, ప్రజలను సమన్వయం చేసుకునే బాధ్యత పార్టీదని చంద్రబాబు అన్నారు. ప్రజలకు మెరుగైన సేవ అందించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. రాజకీయాలపై తన కుటుంబం ఎప్పుడూ ఆధారపడకూడదని తాను నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. న్యాయబద్ధంగా డబ్బు సంపాదించాలని అన్నారు. 54 లక్షల మంది సభ్యత్వం తీసుకున్న పెద్ద కుటుంబం టీడీపీదని చెప్పారు.