: కశ్మీర్ రావణకాష్టంలా మారడానికి నెహ్రూ వైఫల్యాలే కారణం.. బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు
కశ్మీర్ రావణకాష్టంలా మారడానికి మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూనే కారణమని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు విమర్శించారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో అప్పట్లో నెహ్రూ విఫలమయ్యారని అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ స్వాతంత్ర్యానంతరం దేశంలోని 554 సంస్థానాలను విలీనం చేయడంలో పటేల్‌ది ప్రధాన పాత్ర అని అన్నారు. కశ్మీర్ విషయంలో నెహ్రూ మెతక వైఖరి వల్లే నేటికీ ఆ రాష్ట్రం రావణకాష్టంలా మండుతోందని విమర్శించారు. దేశభక్తి, నిజాయతీ, దృఢదీక్ష, పట్టుదలకు పటేల్ నిలువెత్తు నిదర్శనమని హరిబాబు అభివర్ణించారు.