: నగరంలో 40 శాతం పడిపోయిన దీపావళి అమ్మకాలు.. ప్రజల్లో పెరిగిన అవగాహనే కారణం
కాలుష్య నివారణకు స్వచ్ఛంద సంస్థలు చేసిన ప్రయత్నం ఫలించినట్టే కనిపిస్తోంది. ఈ ఏడాది దీపావళి పండుగలో టపాసుల మోత తగ్గింది. బాణసంచా అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు 20 శాతం అమ్మకాలు తగ్గినట్టు అసోచామ్ పేర్కొంది. అయితే అది 20 శాతం కాదని, 40 శాతమని నగరంలోని ట్రేడర్లు చెబుతున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలనే అవగాహన పిల్లల్లో పెరగడమే ఇందుకు కారణమని అంటున్నారు. నగరంలో క్రాకర్స్ అమ్మకాలు సగానికి సగం పడిపోయాయని శాంతి ఫైర్ వర్క్స్ యజమాని భోప్ తెలిపారు. కాలుష్య ప్రభావంపై పెరిగిన అవగాహన, చైనా ఉత్పత్తులను నిషేధించాలని జరిగిన ప్రచారం ఇందుకు ఊతమిచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే టపాసుల వల్ల పర్యావరణానికి జరిగే హాని గురించి పలు పాఠశాలల్లో వివరించి చెప్పడం కూడా విక్రయాలు తగ్గడానికి ఓ కారణంగా చెబుతున్నారు. హైదరాబాద్‌లో పండుగ రోజు కురిసిన భారీ వర్షం ఇందుకు తోడైంది. ఈసారి ప్రజల్లో కాలుష్యంపై అవగాహన బాగా పెరిగిందని, టపాసుల అమ్మకాలు తగ్గడానికి అదే కారణమని ఇండియన్ యూత్ ఫర్ క్లైమేట్ నెట్‌వర్క్ ప్రతినిధి రవితేజ పేర్కొన్నారు.