: ఎన్ కౌంటర్ జరిగినప్పటి నుంచి గిరిజన యువకులు కనపడటం లేదంటూ ఆందోళన
ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దు (ఏవోబీ)లో ఎన్ కౌంటర్ జరిగినప్పటి నుంచి తమ యువకులు కనపడటం లేదంటూ గిరిజనులు ఆందోళనకు దిగారు. ఏవోబీలోని గొరశెట్టిపాలెం జంక్షన్ గిరిజనులు ఈ రోజు సమావేశమయ్యారు. ఏవోబీలో ఎన్ కౌంటర్ జరిగిన నాటి నుంచి 5 గ్రామాలకు చెందిన సుమారు 13 మంది యువకులు కనిపించడం లేదని ఆందోళనకు దిగారు. ఆ యువకులు పోలీసులు అదుపులోనే ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా, మావోయిస్టు అగ్రనేత ఆర్కేతో పాటు పలువురు మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారని ప్రజాసంఘాలు, మానవహక్కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసుల అదుపులోనే ఆర్కే ఉన్నారంటూ ఆయన భార్య పద్మక్క ఈరోజు హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఆర్కేకు ఎలాంటి హాని తలపెట్టొదని, ఆయన బతికున్నాడా? లేక చనిపోయాడా? అని ఏపీ ప్రభుత్వ లాయర్ ను కోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.