: ‘సిమి’ ఉగ్రవాదుల్లో నలుగురు బాంబులు తయారీ కూడా నేర్చుకున్నారట!
పోలీసుల ఎన్ కౌంటర్ లో ఈ రోజు మృతి చెందిన ‘సిమి’ ఉగ్రవాదుల్లో నలుగురికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఉత్తరప్రదేశ్ లోని బిజ్ నోర్ లో వీరు బాంబులు తయారు చేయడం నేర్చుకున్నారని తమ దర్యాప్తులో తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. 2014 సెప్టెంబర్ 12న బిజ్ నోర్ లోని జాతన్ కాలనీలో ఒక ఇంట్లో పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఇంట్లో ఉంటున్న ఆరుగురు వ్యక్తులు తప్పించుకున్నారు. తప్పించుకున్న వారు సిమి ఉగ్రవాదులే! అగ్గి పుల్లలకు వుండే మందును ఉపయోగించి పేలుడు పదార్థాలు తయారు చేసేవారు. ఆ విధంగా చేస్తున్నప్పుడే పేలుడు సంభవించిందనే విషయం తమ విచారణలో వెల్లడైందని పోలీసులు చెప్పారు. ఆరుగురు సభ్యుల్లో నలుగురు జకీర్, అంజద్, సల్లూ,మహబూబ్ లు ఈరోజు జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. మరో ఇద్దరు అస్లాం, ఈజాజ్ లు ఈ ఏడాది ఏప్రిల్ లో తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు.