: న్యాయమూర్తుల ఫోన్లనూ ట్యాప్ చేయిస్తున్న కేంద్రం: కలకలం రేపుతున్న కేజ్రీవాల్ విమర్శ
ఇండియాలో న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన విమర్శలు చేశారు. ఫోన్లో సంభాషణలు వద్దని, అవి ట్యాప్ అవుతున్నాయని ఇద్దరు న్యాయమూర్తులు చెప్పుకోవడాన్ని తాను విన్నానని, ఇది నిజమే అయితే, అంతకన్నా ప్రమాదకర పరిస్థితి మరొకటి ఉండదని అన్నారు. ఇండియాలో న్యాయవ్యవస్థకు స్వాతంత్ర్యం లేకపోయిందని, జడ్జీలు తప్పు చేసిన పక్షంలో కూడా సాక్ష్యాల సేకరణకు వేరే మార్గాలు వాడుకోవాలే తప్ప ఫోన్లపై నిఘా ఉంచరాదని అన్నారు. కాగా, కేజ్రీవాల్ వ్యాఖ్యలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తప్పుబట్టారు. ఇండియాలో ఇప్పటివరకూ న్యాయమూర్తుల ఫోన్లను ఎన్నడూ ట్యాప్ చేయలేదని, ఈ విషయాన్ని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు.