: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కు కీలక ఆటగాడిగా సేవలందించిన బ్రాడ్ హగ్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. తన తాజా పుస్తకం 'ద రాంగ్ యూఎన్'లో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి దాదాపు రెడీ అయిపోయానని చెప్పాడు. తన వైవాహిక జీవితంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురవడమే దీనికి కారణమని తెలిపాడు. "ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రోజున ప్రెమెంటల్స్ బీచ్ వద్ద కారు పార్క్ చేసి సముద్రం వద్దకు నడుచుకుంటూ వెళ్లా. సముద్రపు అలలను చూస్తూ కూర్చున్నా. అయితే, నాకు ఈత రావడం వల్ల ఆత్మహత్య చేసుకోవడం సరైంది కాదని భావించి, తిరిగొచ్చేశా", అని తన పుస్తకంలో బ్రాడ్ హాగ్ వెల్లడించాడు. ఆ తర్వాత చీకటి ప్రదేశంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని మరోసారి ప్రయత్నించానని... అయితే, ఆలోచన వేరు, ఆచరణ వేరు అనే విషయం తనకు అప్పుడు అర్థమయిందని... తాను సాధించాల్సింది ఇంకా ఏదో ఉందనే భావన కలిగిందని... దీంతో, ఆత్మహత్య ఆలోచనను విరమించుకున్నానని చెప్పాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడిన బ్రాడ్ హాగ్... బిగ్ బాష్ లీగ్ లో మెల్ బోర్న్ రెనెగేడ్స్ కు ఆడుతున్నాడు.