: హిల్లరీ క్లింటన్ కు కష్టకాలం... ఈ-మెయిల్స్ పై సెర్చ్ వారంట్ పొందిన ఎఫ్బీఐ
డెమోక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్ కష్టాల్లో పడ్డారు. ఎన్నికలకు మరో 8 రోజుల గడువు మాత్రమే ఉన్న సమయంలో ఆమెకు సంబంధించిన కొన్ని ఈ-మెయిల్స్, కాంగ్రెస్ సభ్యుడు ఆంటోనీ వెయినర్ కంప్యూటర్లో ప్రత్యక్షం కావడంతో, వీటిని మరింతగా పరిశోధించేందుకు ఎఫ్బీఐ సెర్చ్ వారంట్ ను పొందింది. హిల్లరీ క్లింటన్ ప్రైవేట్ ఈ-మెయిల్ సర్వర్ నుంచి ఇవి వెళ్లాయని ప్రాథమిక సాక్ష్యాధారాలు లభ్యం కావడంతో, దీనిపై విచారణ జరపాలని ఫెడరల్ అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. వెయినర్ కంప్యూటర్ లో 6.5 లక్షలకు పైగా ఈమెయిల్స్ ఉన్నాయని, అయితే, వీటిలో అత్యధికం హిల్లరీ క్లింటన్ కు సంబంధించినవేమీ కాదని ఓ అధికారి పేర్కొన్నారు. అయితే, హిల్లరీ క్లింటన్, ఆమె సహాయకురాలు, వెయినర్ మాజీ భార్య హుమా అబెడిన్ ల నుంచి వచ్చిన ఈ-మెయిల్స్ పై ఎఫ్బీఐ విచారణ జరగవచ్చని వివరించారు. హిల్లరీ మంత్రిగా ఉన్న సమయంలో ప్రైవేటు ఈ-మెయిల్ సర్వర్లు వాడారన్న విషయమై ఆమె ఇప్పటికే క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.