: సంవాత్ 2073 సర్వే... యూపీ ఎన్నికలే ఇన్వెస్టర్లకు అతిపెద్ద రిస్క్!
నేటి నుంచి మొదలయ్యే 'సంవాత్ 2073' స్టాక్ మార్కెట్ వర్గాలకు నల్లేరుపై నడకవంటిదేమీ కాదని నిపుణులు విశ్లేషించారు. సంవాత్ సర్వే పేరిట 15 స్టాక్ బ్రోకింగ్ సంస్థల అభిప్రాయాలు కోరగా, ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు స్టాక్ మార్కెట్ కు అతిపెద్ద రిస్క్ అన్న అభిప్రాయం వెల్లడైంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు ఎదురైతే, అది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీస్తుందని సర్వేలో పాల్గొన్న వారు వెల్లడించారు. దీంతో పాటు యూఎస్ ఫెడ్ జరిపే పరపతి సమీక్షలు, ఇండియాలో సంస్కరణల ఆలస్యం, రూపాయి మారకపు విలువ, కమోడిటీ మార్కెట్ ధరలు తదితరాలు కొత్త సంవాత్ సంవత్సరంలో ఇన్వెస్టర్లకు నిద్రలేని రాత్రులను మిగల్చవచ్చని పేర్కొన్నారు. చైనాతో నెలకొన్న ఉద్రిక్తత, సరిహద్దుల్లో పాక్ చేస్తున్న ఆగడాలు, సైబర్ సెక్యూరిటీ తదితరాలు సైతం రిస్క్ కలిగించే అంశాలేనని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్, రీసెర్చ్ టీమ్ హెడ్ గౌతమ్ దుగ్గద్ అంచనా వేశారు. ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమలు ప్రారంభం కాకున్నా ఆ ప్రభావం మార్కెట్ పై ఉంటుందని వివరించారు. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే, మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తుతాయని ఎంకే ఇన్వెస్ట్ మెంట్స్ ఫండ్ మేనేజర్ సచిన్ షా అభిప్రాయపడ్డారు. జీడీపీ వృద్ధి నిదానించడం, ఆస్తుల క్వాలిటీని కాపాడుకోవడంలో బ్యాంకుల వైఫల్యం వంటివి స్టాక్ మార్కెట్ పై ప్రభావాన్ని చూపుతాయని పీర్ లెస్ ఫండ్స్ మేనేజ్ మెంట్ ఈక్విటీ విభాగం హెడ్ అమిత్ నిగమ్ పేర్కొన్నారు.