: ఇస్లామాబాద్ ముట్టడికి ఇమ్రాన్ ఖాన్ పిలుపు.. పాకిస్థాన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు


పాకిస్థాన్‌లోని ప్రతిపక్ష పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ వచ్చే నెల 2న ఇస్లామాబాద్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆయ‌న పిలుపున‌కు ప్ర‌జ‌ల నుంచి భారీ స్పంద‌న వ‌స్తోంది. దీంతో ఆ దేశంలో తీవ్ర క‌ల‌కలం రేగుతోంది. పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కుటుంబం భారీ అక్రమాలకు పాల్పడినట్లు కొన్ని నెల‌ల క్రితం పనామా పేపర్స్ బయటపెట్టిన నేప‌థ్యంలో ఆందోళనలు కొన‌సాగిస్తోన్న ఇమ్రాన్ ఖాన్.. షరీఫ్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళ‌న‌కు వేలాది మంది ప్ర‌తిప‌క్ష పార్టీ కార్యకర్తలతోపాటు అక్క‌డి జ‌నం ఇప్పటికే ఇస్లామాబాద్ వైపునకు క‌దులుతున్న‌ట్లు తెలుస్తోంది. వారిని అణ‌చివేయ‌డానికి స‌ర్కారు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను వినియోగిస్తోంది. వివిధ ప్రాంతాల్లో పీటీఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇస్లామాబాద్‌లోని బనీగాలలోని ఇమ్రాన్ ఖాన్ ఇంటి చుట్టూ పోలీసులు మొహరించారు. అక్కడకు వ‌చ్చిన‌ వందలాది మంది కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. ఇమ్రాన్‌ ఖాన్ ను గృహ‌నిర్బంధంలో ఉంచారు. అక్క‌డ తీవ్ర‌ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెలకొంది. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 2న ప్రజాస్వామ్యం అంటే ఏమిటో ప్ర‌ధానికి చూపిస్తామ‌ని హెచ్చ‌రించారు. ష‌రీఫ్‌ నియంతృత్వ ధోర‌ణికి అడ్డుక‌ట్ట‌వేస్తామ‌ని అన్నారు. పోలీసులు దిగ్బంధించిన ప్రధాన రహదారులపై కాకుండా ఇతర మార్గాల్లో ఆందోళ‌న‌ కోసం త‌మ కార్య‌క‌ర్త‌లు ఇస్లామాబాద్ కు చేరుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ఇమ్రాన్ ఖాన్‌ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేయ‌డంతో పాక్‌లోని అన్ని ప్రాంతాల్లో నిరసనలు చేప‌డుతున్నారు.

  • Loading...

More Telugu News