: భారత్ వృద్ధిని సాధిస్తోంది... అమెరికా ఎందుకు సాధించడం లేదు?: ట్రంప్
ప్రెసిడెంట్ పదవికి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై తీవ్ర విమర్శలు చేశారు. భారత్ లాంటి ఒక పెద్ద దేశమే 8 శాతం ఆర్థికాభివృద్ధిని సాధిస్తుంటే... అమెరికా ఎందుకు సాధించలేకపోతోందని ఆయన ప్రశ్నించారు. తన పాలనలో ఒక్క ఏడాది కూడా 3 శాతం కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించలేకపోయిన అధ్యక్షుడు ఒబామానే అని ఆయన విమర్శించారు. న్యూహాంప్ షైర్ లోని మాంచెస్టర్ లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా పెద్ద దేశాలకు వృద్ధిని నమోదు చేయడం చాలా కష్టమని... కానీ, భారత్ దాన్ని సాధిస్తోందని అన్నారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే... నాలుగు శాతం వృద్ధిని సాధిస్తానని తెలిపారు. 7 శాతం వృద్ధిని సాధించినా చైనా తృప్తిగా లేదని... అమెరికా మాత్రం మెక్సికో, ఇతర ప్రాంతాలకు ఉద్యోగాలను తరలిస్తూ అలాగే ఉండిపోయిందని మండిపడ్డారు.