: పేటీఎం సీఈఓను రిక్షా ఎక్కించిన ట్రాఫిక్!..ఆ ఫొటోను పోస్ట్ చేసిన సీఎం అఖిలేష్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు సైతం ట్రాఫిక్ తలనొప్పి తప్పలేదు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో తన కారు ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో ఆయన రిక్షాలో ప్రయాణించాల్సి వచ్చింది. అది కూడా, యూపీ సీఎం అఖిలేష్ నివాసానికి వెళుతుంటే జరిగింది! ‘యశ్ భారతి’ అవార్డును తీసుకునేందుకు ఆయన లక్నో వచ్చారు. 5 కాళిదాస్ మార్గ్ లోని అఖిలేష్ నివాసానికి శేఖర్ శర్మ రిక్షాలో చేరుకోగానే, అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. శేఖర్ శర్మను, రిక్షా కార్మికుడు మనిరామ్ ను భద్రతా సిబ్బంది తనిఖీ చేసి లోపలికి పంపించారు. అయితే, విజయ్ శేఖర్ ను ఆహ్వానించేందుకు అక్కడికి వచ్చిన సీఎం అఖిలేష్ ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కాగా, ఇందుకు సంబంధించిన ఫొటోను అఖిలేష్ యాదవ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఇదిలాఉండగా, అంతటి ట్రాఫిక్ లోనూ విజయ్ శేఖర్ ను తీసుకువచ్చినందుకు, ఆ రిక్షా కార్మికుడు మనిరామ్ కు ఆరువేల రూపాయలను సీఎం బహుమతిగా ఇచ్చారు. అతనికి ఇల్లు, ఈ-రిక్షా, సమాజ్ వాదీ పెన్షన్ పథకం కింద లబ్ధి చేకూరేలా చేస్తానని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు.