: ఆస్ట్రేలియాలో అమానుషం... అందరూ చూస్తుండగానే పంజాబీ డ్రైవర్ ను సజీవదహనం చేశారు
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో దారుణం చోటు చేసుకుంది. అక్కడ ఓ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్న 29 ఏళ్ల పంజాబీ డ్రైవర్ మన్ మీత్ అలీషర్ ను సజీవదహనం చేశారు. ప్రయాణికుల్లో ఒకరు మన్ మీత్ పై మండే స్వభావం గల ఒక ద్రవం పోసి, నిప్పంటించారని పోలీసులు తెలిపారు. మంటల్లో పూర్తిగా చిక్కుకుపోయిన ఆయన... అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పారు. బ్రిస్బేన్ లోని పంజాబీ ప్రజల్లో మన్ మీత్ ప్రముఖ గాయకుడిగా గుర్తింపు పొందాడు. అయితే, ఈ ఘటన జాతి వివక్షకు సంబంధించినదిగా లేదని పోలీస్ కమిషనర్ ఇయాన్ స్టీవార్ట్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి, బస్టాపులో ఉన్న 48 ఏళ్ల అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకొని, విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఘటనకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు.