: వారం రోజుల్లో హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలి.. లేదంటే నేనే ఆందోళనకు దిగుతా: కిషన్‌రెడ్డి
తమ సమస్యల పరిష్కారం కోసం హోంగార్డులు చేస్తోన్న ఆందోళనకు బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఈ రోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వారం రోజుల్లో వారి సమస్యలను సర్కారు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే తానే వారి తరఫున ఆందోళనకు దిగుతానని ప్రకటించారు. హోం గార్డుల సమస్యలపై గవర్నర్ నరసింహన్‌తో పాటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు లేఖలు రాస్తానని పేర్కొన్నారు. ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తోన్న హోంగార్డులకు కనీస మర్యాద, వేతనం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. సర్కారు హోంగార్డులను బానిసలుగా చూస్తుండటం వల్లే వారి ఆందోళన ఉద్ధృతంగా కొనసాగుతోందని కిషన్‌రెడ్డి అన్నారు. వారి నుంచి శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. హోంగార్డులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నా వారికి పదవీ విరమణ సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదని విమర్శించారు. వారికి వేతనంతో కూడిన సెలవులు కూడా లభించడం లేదని చెప్పారు. వారిపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వివక్ష ఉందని అన్నారు. ప్రభుత్వం హోంగార్డుల డిమాండ్లను సానుభూతితో పరిశీలించాలని అన్నారు. నిరసన తెలుపుతున్న హోంగార్డులకు నోటీసులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు.