: సాధిస్తారా? చతికిలపడతారా?...టైటిల్ పోరు రేపే


ఫైనల్ మ్యాచ్ కు న్యూజిలాండ్, టీమిండియా జట్లు సిద్ధమవుతున్నాయి. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా రేపు డేనైట్ మ్యాచ్ జరగనుంది. టెస్టు హోదా సంపాదించిన వైజాగ్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు జరగగా, నాలుగింట విజయం సాధించిన టీమిండియా ఒక మ్యాచ్ లో ఓటమిపాలైంది. ధోనీని అంతర్జాతీయ స్థార్ ను చేయడంలో వైజాగ్ స్టేడియంలో ఆడిన ఇన్నింగ్స్ ది ప్రముఖ పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి చోట ధోనీ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నవేళ మరోసారి ధోనీ ఇక్కడే ఆడడంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. అదే సమయంలో టీమిండియా కోహ్లీ-రోహిత్ భాగస్వామ్యానికి ఇక్కడ మంచి సమన్వయం కుదిరింది. అదంతా ఒక ఎత్తైతే ఒకరకంగా రోహిత్ శర్మకు ఈ స్టేడియం సొంత స్టేడియం లాంటిది. ఎందుకంటే రోహిత్ శర్మ అమ్మమ్మగారి ఊరు, బాల్యంలో గడిపిన ఊరు ఇదే కావడానికి తోడు, రోహిత్ చిన్ననాటి స్నేహితులు, బంధువులు కూడా ఇక్కడే ఉన్నారు. మధుర జ్ఞాపకాలు కలిగిన ఈ ఊర్లో రాణించాలని రోహిత్ భావించడంలో ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలో భారత జట్టు ఈ మ్యాచ్ లో విజయం ఖాయమని ధీమాగా ఉంది. అదే సమయంలో టీమిండియాపై ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా వన్డే సిరీస్ ను చేజిక్కించుకోవాలని కివీస్ భావిస్తోంది. కివీస్ బౌలర్లు ఫుల్ స్వింగ్ లో ఉండగా, బ్యాట్స్ మన్ గాడినపడ్డారు. ఫీల్డర్లు పాదరసంలా కదులుతున్నారు. దీనికి తోడు ఈ పిచ్ కివీస్ కు కొత్త. దీంతో కివీస్ భారతజట్టును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. టీమిండియాలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. పేసర్, యార్కర్ కింగ్ బుమ్రాకు తుదిజట్టులో స్థానం కల్పించనున్నారు. బుమ్రా కోసం అక్షర్ పటేల్, ధవల్ కులకర్ణి, లేదా అమిత్ మిశ్రా లలో ఎవరో ఒకర్ని తప్పించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News