: జయలలిత పాత్రలో నటించాలని ఉంది!: త్రిష
ముఖ్యమంత్రి కావాలని ఉందని ప్రముఖ సినీ నటి త్రిష తెలిపింది. 'కొడి' సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం బయోగ్రఫీల యుగం నడుస్తోందని, బాలీవుడ్ లో పలువురు క్రీడా ప్రముఖుల జీవిత చరిత్రలు సినిమాలుగా వచ్చి, మంచి విజయం సాధిస్తున్నాయని పేర్కొంది. ఈ సందర్భంగా తనకు ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించాలని ఉందని తెలిపింది. తామిద్దరం ఒకే స్కూల్ (చర్చ్ పార్క్) లో చదువుకున్నామని గుర్తుచేసింది. జయలలిత జీవితం స్పూర్తివంతంగా ఉంటుందని, ఆమె పాత్రలో నటించడం ద్వారా ముఖ్యమంత్రిగా కనిపించవచ్చని తెలిపింది. అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోనని త్రిష తెలిపింది. దీంతో తమిళ దర్శకులెవరైనా జయలలిత జీవిత చరిత్రతో సినిమా తీయాలనుకుంటే తనను సంప్రదించవచ్చని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది. మొత్తానికి అవకాశాలు కల్పించుకోవడంలో త్రిష మంచి చొరవ చూపిస్తున్నట్టే కనబడుతోంది. అందుకే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లైనా టాప్ హీరోయిన్ గానే చెలామణి అవుతోంది.