: ఆర్కే బాడీ గార్డ్స్, అక్కడి ప్రజలే ఆయన్ని కాపాడుకున్నారు: భార్య పద్మక్క
ఎన్ కౌంటర్ లో ఆర్కేను చంపేశారని, కాదు బతికున్నారని.. ఇలా రకరకాలుగా చెబుతున్నారని ఆయన భార్య పద్మక్క అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆర్కే ఉన్నారని.. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చుట్టుముట్టి చంపారని, విషప్రయోగం జరిగిందని రకరకాలుగా చెబుతున్నారు. ఈ విషయంలో క్లారిటీ రాలేదు. అయితే ఆర్కే అక్కడ ఉన్నారని ఎన్ కౌంటర్ చేశారేమో కానీ, ఆయన బాడీ గార్డ్స్, అక్కడి ప్రజలే ఆర్కేను కాపాడుకున్నారు’ అని అన్నారు. ఆర్కే ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారని, నడవలేని స్థితిలో ఉన్నారని పోలీసులకు పక్కా సమాచారం ఉందనే ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ, ‘ఆయన్ని పట్టుకుని మరింత టార్చర్ పెట్టాలని పోలీసులు చూస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న ఆయనకు వైద్యం చేయిస్తామని చెబుతున్న పోలీసుల మాటలు ఎలా నమ్ముతాం? నేనైతే నమ్మను’ అని అన్నారు. ‘మున్నా తన తండ్రి ఆర్కేను చూసేందుకే చిన్నవయస్సులోనే ఉద్యమంలోకి వెళ్లాడంటున్నారు. అసలు, తన తండ్రిని మున్నా చూశాడా?’ అనే ప్రశ్నకు మున్నా తల్లి పద్మక్క సమాధానమిస్తూ.. "అవును, వాళ్ల నాన్నను చూసేందుకే వెళ్లాడు. ఆ తర్వాత, ప్రజల బాధలు, పరిస్థితులు, గ్రామాల్లో విచక్షణా రహితంగా జరుగుతున్న దాడులను మున్నా తన కళ్లారా చూశాడు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఉద్యమంలో ఉండిపోవాలని మున్నా నిర్ణయించుకున్నాడు’ అని చెప్పారు.