: వరుణుడు కరుణిస్తే...వైజాగ్ వన్డే వ్యూహాలివే!
కయాంత్ రూపంలో వరుణుడు ఆగ్రహిస్తే వైజాగ్ లో ఈ నెల 25న జరగాల్సిన ఐదో వన్డే రద్దవుతుంది. లేని పక్షంలో టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతుందనే చెప్పచ్చు. ఐదు వన్డేల సిరీస్ లో చెరి రెండు వన్డేలను రెండు జట్లు గెలుచుకోవడంతో టైటిల్ మ్యాచ్ ఆసక్తి రేపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు రెండూ సమతూకంతో ఉన్నాయి. కీలకమైన మ్యాచుల్లో గుప్తిల్, రాస్ టేలర్ నిలకడ ప్రదర్శించడం ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. అదే సమయంలో జట్టుకు వెన్నెముకగా ఉన్న కోహ్లీ అవుటైతే మిగిలిన వాళ్లంతా క్యూ కట్టడం టీమిండియాను అయోమయంలోకి నెడుతోంది. టీమిండియా ఓటమిపాలైన రెండు వన్డేలు బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యం వల్ల సంభవించినవే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే టీమిండియా బలహీనత ఫీల్డింగ్, అలాగే న్యూజిలాండ్ అంత బలమైన బౌలింగ్ వనరులు టీమిండియాకు లేకపోవడం కూడా ఒకింత ఇబ్బంది కలిగించేదే. నాలుగో వన్డేలో ధోనీ వికెట్లను చూడకుండా చేసిన స్టంపులు మిస్ అయిన సంగతి తెలిసిందే. వర్థమాన కీపర్ అయితే వికెట్ల వెనుక బంతికోసం ఎదురు చూస్తాడు. మరి ధోనీ మాత్రం వికెట్ల ముందు నిల్చుని, గల్లీ క్రికెట్ లోలా వెనకవైపు బంతిని విసిరి స్టంప్ చేయాలని ప్రయత్నించడం వంటి ప్రయోగాలు విఫలమైన సంగతి తెలిసిందే. అలాగే టీమిండియా ఆటగాళ్లలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దానిని పూరించుకోని పక్షంలో టైటిల్ రేసులో వెనుకబడడం ఖాయం. అదే సమయంలో చివరి బంతివరకు పట్టువీడకుండా పోరాడడం న్యూజిలాండ్ ఆటగాళ్ల బలం. మైదానంలో పాదరసంలా కదలడం, ఊహించని విధంగా క్యాచ్ లు అందుకోవడం, పరుగులను నియంత్రించడం కూడా వారికి విజయంపై ఆశలు సజీవంగా ఉంచుతోంది. అయితే బ్యాటింగ్ ఆర్డర్ పరంగా చూసినా, మైదానంలోని అభిమానుల మద్దతు పరంగా చూసినా టీమిండియాకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీంతో విజయ సాధన పెద్ద కష్టం కాదు.