: యువభేరి పేరుతో సమావేశాలు నిర్వహించి విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారు: గాలి ముద్దుకృష్ణమ ధ్వజం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పలు వ్యాఖ్యలు చేస్తోన్న ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. ఈ రోజు ఆయన విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... హోదా కోసం ప్రాణత్యాగం చేస్తామంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని, మరి రాష్ట్ర విభజన సమయంలో వైసీపీ అధినేత జగన్ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలకు చట్టసభలపై గౌరవం లేదని ఆయన విమర్శించారు. ఇటీవల అసెంబ్లీలో ప్రవర్తించిన తీరుకు వైసీపీ సభ్యులు సభాహక్కుల కమిటీ ముందు పశ్చాత్తాపం వ్యక్తం చేసివుంటే తాము వారిని అభినందించేవారమని ముద్దుకృష్ణమ పేర్కొన్నారు. ప్రశ్నించాల్సినప్పుడు మౌనంగా ఉన్న వైసీపీ నేతలు ఇప్పుడు హోదాపై ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. యువభేరి పేరుతో సమావేశాలు నిర్వహించి విద్యార్థులను వైసీపీ అధినేత తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల స్థాపనలో తెలంగాణతో సమానంగా ఉన్న విషయాన్ని వైసీపీ నేనతలు తెలుసుకోవాలని ఆయన సూచించారు.