: 'ఉంగరం కొంటే గన్ ఉచితం'... వ్యాపారం పెంచుకునేందుకు ఓ అమెరికన్ స్పెషల్ ఆఫర్
పది గ్రాముల బంగారం కొంటే పది గ్రాముల వెండి ఉచితంగా ఇస్తామన్న ప్రకటనలు ఇండియాలో సర్వ సాధారణంగా వినిపించేవే. ముఖ్యంగా పండగలు, సెలవుల వేళ, తమ అమ్మకాలను పెంచుకునేందుకు అధికంగా కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యాపారులు ఇలాంటి స్కీములను ప్రకటిస్తుంటారు. ఇక అమెరికాలోని 'థ్యాకర్ జ్యూవెల్లరీ' అనే ఆభరణాల దుకాణం యజమాని 'షాట్ గన్ వెడ్డింగ్ సేల్' పేరిట స్పెషల్ ఆఫర్ ఇచ్చారు. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు జరిగే అమ్మకాల్లో భాగంగా 2 వేల డాలర్ల విలువైన ఉంగరం కొనుగోలు చేస్తే, రెమింగ్టన్ 870 షాట్ గన్ లేదా బోల్ట్ యాక్షన్ రైఫిల్ ను ఉచితంగా పొందవచ్చని చెబుతున్నాడు. ఇలాంటి ఆఫర్ ఈ ప్రపంచంలో మరెక్కడా లభించదన్నది ఆయన వాదన. నిజమేనేమో!