: ట్రంప్, హిల్లరీల మధ్య తేడా కేవలం ఒక్క పాయింట్ లోపే!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. తొలుత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయిన ట్రంప్... మహిళలతో అతను వ్యవహరించిన తీరుతో, ఆ తర్వాత రేసులో వెనుకబడిపోయారు. కానీ, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మళ్లీ పుంజుకుంటున్నారు. ప్రస్తుతానికి ట్రంప్, హిల్లరీల మధ్య తేడా కేవలం ఒక్క పాయింట్ లోపే ఉందని ఐబీడీ-టిప్ పోల్ సర్వే వెల్లడించింది. సర్వే ప్రకారం ట్రంప్ కు 41.2 శాతం ఓట్లు పడనుండగా, హిల్లరీ 41.8 శాతం ఓట్లను కైవసం చేసుకోనున్నారు. అంటే, ఇద్దరి మధ్య తేడా కేవలం 0.6 శాతమే అన్నమాట. మరో విషయం ఏమిటంటే, 2012లో జరిగిన అధ్యక్ష ఎన్నికలను కూడా ఐబీడీ-టిప్ కరెక్ట్ గా అంచనా వేయగలిగింది. అయితే మిగిలిన సర్వేలు మాత్రం హిల్లరీనే లీడింగ్ లో ఉన్నారని చెబుతున్నాయి. ఫాక్స్ అంచనాల ప్రకారం ట్రంప్ 41 శాతం, హిల్లరీ 44 శాతం ఓట్లను కైవసం చేసుకోనున్నారు. యూఎస్ టుడే-సఫాల్క్ యూనివర్శిటీ అంచనాల ప్రకారం ట్రంప్ కన్నా హిల్లరీకి 9 శాతం ఎక్కువ ఓట్లు పడనున్నాయి. రాయిటర్స్ కూడా హిల్లరీకి 4 శాతం ఎక్కువ ఓట్లు పడతాయని అంచనా వేస్తోంది. లాస్ ఏంజెలెస్ టైమ్స్ సర్వే మాత్రం ట్రంప్ లీడింగ్ లో ఉన్నారని (ఒక పాయింట్ తేడా) వెల్లడించింది. జాతీయ ఎన్నికలపై దృష్టి సారించే రియల్ క్లియర్ పాలిటిక్స్ కూడా ఇద్దరి మధ్య తేడా రోజురోజుకూ తగ్గుతోందని స్పష్టం చేసింది.