: భార్యను కారులోనే పొడిచి చంపిన కసాయి భర్త.. ఢిల్లీలో మరో ఘోర ఘటన
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో గొడవపడిన ఓ 60 ఏళ్ల వృద్ధుడు ఆమెను ఘోరంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ ప్రాంతంలో ముఖేశ్ మోంగా తన భార్య మంజు మోంగాతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. కారులో మంజు ఓ ఫోన్ కాల్ మాట్లాడిన తరువాత అదే కాల్ విషయంపై వారిరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన ముఖేశ్ ఆగ్రహంతో కత్తితో కారులోనే భార్య గొంతు కోశాడు. దీంతో మంజు మోంగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ముఖేశ్ వెంటనే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. విషయాన్ని గమనించిన స్థానికులు ఆయనను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ హత్య విషయమై పోలీసులకి ముకేశ్ చెప్పిన కథ ఈ విధంగా ఉంది. తాను తన భార్యతో కలిసి కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఆమె ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడిందని, స్నేహితుడితో మాట్లాడుతున్నట్లు తనకు చెప్పిందని ఆయన అన్నాడు. తనముందే తన భార్య మరో వ్యక్తితో మాట్లాడడం చూసి ఈ హత్య చేశానని పోలీసులకు చెప్పాడు. ముఖేశ్ ప్రతిరోజు తాగి వచ్చి తన భార్యతో వాగ్వివాదానికి దిగేవాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. ముఖేశ్ పిల్లలు తమ తండ్రి గురించి చెబుతూ.. తమ తండ్రి ఓ మ్యూజిక్ స్కూల్‌లో గిటార్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసేవాడని, అయినప్పటికీ అమ్మ సంపాదించే డబ్బుతోనే ఇల్లు గడిచేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.