: భీకరమైన బాలిస్టిక్ క్షిపణిని తయారు చేసిన రష్యా... ఒక్క పేలుడుతో తమిళనాడు అంతటి భూభాగం బుగ్గిపాలు
అణ్వాయుధ దేశాల మధ్య పోటీ తీవ్రతరమవుతోంది. ఒక దేశానికి మించి మరొక దేశం అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తున్నాయి. ఈ సారి ప్రపంచ యుద్ధం వస్తే, సమస్త మానవాళి అంతరించిపోయే విధంగా ఆయుధాలు రూపొందుతున్నాయి. ఈ క్రమంలో, రష్యా మొట్టమొదటి సూపర్ హెవీ థర్మో న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణి ఆర్ఎస్-28 సర్మాట్ ను తయారుచేస్తోంది. ఖండాంతర క్షిపణి అయిన ఆర్ఎస్-28 ఫొటోలు ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్షిపణి ఒకేసారి 16 అణు వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. దీని బరువు 100 టన్నులు. 10 టన్నుల హెవీ పేలోడ్ ను మోసుకెళుతుంది. ఒకే సమయంలో 16 తేలికపాటి లేదా 10 బరువైన వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. ఒక్క పేలుడుతో తమిళనాడు రాష్ట్రం అంతటి ప్రాంతాన్ని సునాయాసంగా బుగ్గిపాలు చేయగలదు. మేకెయెవ్ రాకెట్ డిజైన్ బ్యూరో ఈ భీకర క్షిపణిని డిజైన్ చేసింది. ఇప్పటిదాకా వాడిన ఎస్ఎస్-18 శాటన్ ఆయుధాల స్థానంలో ఆర్ఎస్-28 సర్మాట్ క్షిపణులను మోహరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నారట. 2020 నాటికి రష్యా అమ్ములపొదిలోకి ఈ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్ చేరనున్నాయి.