: 'మహాకూటమి' దిశగా అడుగులు... సోదరుడు శివపాల్ ను ఢిల్లీకి పంపిన ములాయం
వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, వివిధ పార్టీలతో ఎన్నికల పొత్తులు కుదుర్చుకుని 'మహా కూటమి'ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలతో చర్చించేందుకు తన సోదరుడు శివపాల్ యాదవ్ ను ఆయన ఢిల్లీకి పంపించారు. వచ్చే వారంలో సమాజ్ వాదీ పార్టీ 25వ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా జరపాలని నిర్ణయించిన ఆయన, ఆ వేదికపై నుంచే మహా కూటమిని ప్రకటిస్తారని తెలుస్తోంది. గత సంవత్సరంలో బీహార్ లో నితీష్ కుమార్ మహా కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన నేపథ్యంలో ములాయం కూడా జనతా దళ్ యునైటెడ్, కాంగ్రెస్ తదితర పార్టీలతో పొత్తు కలుపుకుని ఎన్నికలను ఎదుర్కొంటే మేలు కలుగుతుందని, బీజేపీని నిలువరించవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. గత కొంతకాలంగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరగడం, ముఖ్యమంత్రి అఖిలేష్, సొంత తమ్ముడి మధ్య తగవులతో పార్టీ కింది స్థాయి కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని, పరిస్థితిని వెంటనే చక్కదిద్ది, నేతలను ఎన్నికల బరికి సిద్ధం చేయాలన్నది ములాయం ఆలోచనగా తెలుస్తోంది.