: విరక్తి చెందా.. ఇకపై తొలిరోజు థియేటర్లకు వెళ్లి సినిమా చూడను: సమంత
దక్షిణాది అగ్ర హీరోయిన్లలో ఒకరుగా వెలుగొందుతున్న సమంత ఈ మధ్య వార్తల్లో బాగా నిలుస్తోంది. మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాలను మొహమాటం లేకుండా చెప్పేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తన గురించి పలు సంగతులు అభిమానులకు వివరిస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇక ఏ సినిమాని కూడా ఫస్ట్ డే సినిమా హాల్ కు వెళ్లిచూడబోనని చెప్పేసింది. ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందో కూడా పేర్కొంది. ఇటీవలే ఆమె నటించిన సినిమాలు ‘తెరి’, ‘జనతా గ్యారేజ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలను చూడడానికి తాను తొలిరోజే థియేటర్లకు వెళ్లిందట. అయితే, థియేటర్లలోని అభిమానుల్లో కొందరు సదరు సినిమాలు బాగోలేవని, ఎక్కువ రోజులు ఆడవని అనుకున్నారట. అభిమానుల మాటలు తన చెవిలో పడడంతో తాను విరక్తి చెందినట్లు పేర్కొంది. అభిమానులు అనుకున్న విధంగా ఆ సినిమాలు ప్లాప్ కాలేదని, సూపర్‌హిట్ అయ్యాయని చెప్పింది. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.