: టాటా కంపెనీ బోర్డు పిచ్చిదనుకున్నావా?: మిస్త్రీపై టాటా లీగల్ కౌన్సిల్


తనను తొలగించడం అన్యాయమని, కనీస ధర్మాలు పాటించకుండానే తీసేశారని టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ చేసిన ఆరోపణలపై రతన్ టాటా లీగల్ కౌన్సిల్, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మనూ సంఘ్వీ స్పందించారు. మిస్త్రీ రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే ఉన్నాయని ఆరోపించిన సంఘ్వీ, ప్రముఖులతో కూడిన బోర్డు పిచ్చిదనుకున్నావా? అంటూ ప్రశ్నించారు. టాటాల బోర్డును చేతకానిదని భావించి, అధికారం ఉంది కదా అని, తన ఇష్టానికి వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. బోర్డులోని ప్రతి ఒక్కరికీ మిస్త్రీ మీద నమ్మకం పోయిందని తెలిపారు. 9 మంది సభ్యులున్న బోర్డులో ఆరుగురు ఆయన్ను తొలగించాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. తనను అధికారాలు లేని చైర్మన్ స్థాయికి తగ్గించేశారంటూ మిస్త్రీ చేసిన ఆరోపణలను ఖండిస్తూ, 78 ఏళ్ల రతన్ టాటా తోలుబొమ్మలాట లాడించే వ్యక్తి కాదని అన్నారు. తనకు అన్ని బోర్డు సమావేశాలకు హాజరయ్యే అధికారమున్నా, రతన్ గత నాలుగేళ్లలో మిస్త్రీకి స్వీయ నిర్ణయాలు తీసుకునేందుకే అవకాశాలు ఇచ్చారని, మిస్త్రీ వాటిని దుర్వినియోగం చేశాడని ఆరోపించారు.

  • Loading...

More Telugu News