: కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. శ్రమ దోపిడీకి కృత్రిమ ప్రాతిపదికలు చెల్లవన్న ధర్మాసనం
కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల విషయంలో అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. శాశ్వత ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకే పనికి ఒకేరకమైన వేతనం అన్న విధానాన్ని అనుసరించాల్సిందేనంటూ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎస్ఏ బాబ్డేలతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా తనకు వేతనం చెల్లించాలని ఆదేశించాలంటూ పంజాబ్‌కు చెందిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ విషయంలో హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. ‘‘ఒకే రకమైన పనికి, ఒకే రకమైన వేతనం అందించాలి. కార్మికులకు వారి ప్రయోజనాలు దక్కకుండా చేసేందుకు కృత్రిమ ప్రాతిపదికలు సృష్టించడం తప్పు’’ అని విస్పష్టంగా పేర్కొంది. ఒకే రకమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఒకే రకమైన పని చేస్తున్న వ్యక్తికి కాంట్రాక్ట్ పేరుతో తక్కువ వేతనం, అదే పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగికి ఎక్కువ వేతనం ఇవ్వడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. సంక్షేమ రాజ్యంలో ఇది అస్సలు కుదరని కుండ బద్దలు గొట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరూ తమ ఇష్ట ప్రకారం తక్కువ వేతనానికి పనిచేయరని, తమ కుటుంబాన్ని పోషించుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో తన ఆత్మగౌరవాన్ని, హుందాను, స్వీయ విలువను తగ్గించుకుని మరీ పనిచేస్తారని, లేదంటే తమపై ఆధారపడిన వారు ఇబ్బందులు పడాల్సి వస్తుందనే భయం వారిలో ఉంటుందని కోర్టు వివరించింది. శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగుల మధ్య వేతనాల్లో వ్యత్యాసం ఉండడమంటే శ్రమను దోచుకోవడమేనని, అది కచ్చితంగా అణచివేత చర్య కిందికే వస్తుందని ధర్మాసనం వివరించింది.