: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై త్వరగా తేల్చండి.. తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
స్పీకర్ వద్ద పెండింగులో ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఎంతకాలం లోగా తేలుస్తారో చెప్పాలంటూ తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ విషయాన్ని వచ్చే నెల 8వ తేదీలోగా చెప్పాలని సూచించింది. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ చీఫ్, ఎమ్మెల్యే సంపత్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింగ్టన్ నారిమన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కాంగ్రెస్ నుంచి గెలిచి అధికార పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ 2014 ఆగస్టులోనే స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చామని పిటిషనర్ తరపు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కోర్టుకు తెలిపారు. రెండేళ్లు దాటినా పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు. గతేడాది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా స్పీకర్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన దస్తీ నోటీసులను పిటిషనర్ స్వయంగా ప్రతివాదులకు అందించినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే అవి తమకు అందలేదని స్పీకర్ తరపు న్యాయవాది ఉదయ్ కుమార్ సాగర్ తెలిపారు. ఆయన వాదనను వ్యతిరేకించిన జంధ్యాల ఇందుకు సంబంధించిన మీడియా క్లిప్పింగులను కోర్టుకు అందించారు. దీంతో స్పందించిన ధర్మాసనం స్పీకర్ వద్ద పెండింగులో ఉన్న అనర్హత పిటిషన్లను పరిష్కరించడానికి ఎంత సమయం కావాలో వచ్చే నెల 8వ తేదీలోగా కోర్టుకు తెలపాలని ఆదేశిస్తూ విచారణను ఆ రోజుకు వాయిదా వేశారు.