: పాకిస్థాన్‌లో జరిగిన భారీ ఉగ్రదాడిపై స్పందించిన వెంకయ్యనాయుడు.. పాక్ మేల్కోవాలని పిలుపు
ఇటీవలే పాకిస్థాన్‌లోని క్వెట్టాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలూచిస్థాన్ పోలీసు శిక్షణ కేంద్రంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో 60 మంది మృతి చెందిన సంగతి విదితమే. ఈ ఘటనపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆ దాడిలో అంతమంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు. ఈ ఘటనతోనైనా పాకిస్థాన్ మేల్కోవాలని అన్నారు. భారత్‌పై ఉగ్రవాదులు దాడిచేసేలా పాకిస్థాన్ నిధులు సమకూరుస్తోందని అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని చెప్పారు. ఉగ్రవాదంతో ఏ దేశానికైనా ప్రమాదమేనని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో చెలరేగుతున్న వివాదాలపై వెంకయ్య స్పందిస్తూ... అంతర్గత కలహాలతో సమాజ్‌వాదీ పార్టీ సమస్యలు ఎదుర్కుంటోందని అన్నారు. కుటుంబాన్ని, పార్టీని చక్కబెట్టుకోలేకపోతోన్న ఆ పార్టీ నేతలు రాష్ట్రాన్ని ఎలా చక్కబెడతారని వ్యాఖ్యానించారు. ఎస్పీ, బీఎస్పీలు సిద్ధాంతం, ఎజెండాలు లేని పార్టీలని ఆయన అన్నారు.