: మ్రోగిన గంటలు... బర్టెలాలోని క్రైస్తవుల్లో పెల్లుబికిన భావోద్వేగాలు!
ఇరాక్ లోని బర్టెలా నగరంలో రెండేళ్ల తరువాత చర్చిల్లో గంటలు మోగాయి. రెండేళ్లలో ఎంతో మంది క్రైస్తవులు నిత్యనరకం అనుభవించిన తరువాత ఇరాకీ సేనలు, కుర్దు బలగాలు, అస్సిరియన్ వలంటీర్ల సాయంతో స్వేచ్ఛావాయువులు పీల్చుతున్నారు. రెండేళ్ల క్రితం ఇరాక్ లోని వివిధ ప్రాంతాలను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. 2014లో క్రైస్తవుల ప్రాబల్యం అధికంగా ఉన్న బర్టెలా ప్రాంతాన్ని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్న తరువాత, అల్లాను మినహాయించి ఇతరులను పూజించే వారంతా పన్నులు కట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో మైనారిటీలపై ఉక్కుపాదం మోపారు. దారుణమైన చిత్రహింసలకు గురిచేశారు. ఎదురు తిరిగిన లేదా ఆదేశాలు ధిక్కరించిన చాలా మందిని మూకుమ్మడిగా హతమార్చారు. దీంతో చాలా మంది మైనారిటీలు ఇరాకీ సేనల అధీనంలో ఉండే ప్రాంతాలకు పారిపోయారు. అయితే ఐఎస్ఐఎస్ కు కీలకమైన మోసూల్ వైపు ఇరాకీ సేనలు, కుర్దు బలగాలు, అస్సిరియన్ వలంటీర్లు కదులుతూ మార్గమధ్యంలో ఉన్న ప్రాంతాలను ఉగ్రవాదుల చెర నుంచి విముక్తం చేశారు. దీంతో బర్టెలా పట్టణం ఉగ్రవాదుల కబంద హస్తాల్లోంచి విడుదలైంది. అనంతరం సంకీర్ణ సేనలు ఇద్దరు ఫాదర్లతో అక్కడి చర్చ్ ను తెరిపించాయి. దీంతో అక్కడి చర్చ్ లలో గంటలు మోగుతున్నాయి. సుదీర్ఘ విరామం అనంతరం చర్చ్ లలో గంటలు మోగడంతో అక్కడి క్రైస్తవుల్లో భావోద్వేగాలు పెల్లుబికాయి. దీంతో ఎంతో కాలం తరువాత క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు.