: బీహార్ లో మహిళా ఇంజనీర్ సజీవదహనం
బీహార్ లోని ఒక మహిళా జూనియర్ ఇంజనీర్ ను గుర్తు తెలియని వ్యక్తులు సజీవదహనం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ ఆర్ఈజీఏ)లో ముజఫర్ నగర్ లోని మొరౌల్ బ్లాక్ లో జూనియర్ ఇంజనీర్ గా సరితా దేవి పని చేస్తోంది. సుమారు 35-40 సంవత్సరాల మధ్య వయసు ఉండే ఆమెకు ఇద్దరు సంతానం. సీతామాడిలోని బజరంగ్ విహార్ కాలనీలో ఆమె అద్దెకు ఉంటోంది. ఆమెను తన ఇంట్లోనే కుర్చీలో తాళ్లతో కట్టేసి గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. విచారణ నిమిత్తం ఇంటి యజమాని విజయ్ గుప్తాను తమ కస్టడీలోకి తీసుకున్నామని పోలీసు అధికారులు చెప్పారు. రెండు రోజుల క్రితం ఈ సంఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నామని, ఆమెను సజీవదహనం చేసేందుకు కిరసనాయిల్ ను దుండగులు ఉపయోగించారని, ఈ దారుణానికి పాల్పడడం వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు. కొన్నేళ్లుగా ఆమె తన భర్త నుంచి విడిగానే ఉంటోందని పోలీసులు పేర్కొన్నారు.