: అద్భుతం.. తల్లి కడుపులోంచి రెండు సార్లు బయటకు వచ్చిన శిశువు!


అమెరికాలో ఒక శిశువు తల్లి కడుపు నుంచి రెండు సార్లు బ‌య‌టికొచ్చింది. ఆశ్చ‌ర్యం క‌లిగించే ఈ అద్భుతాంశానికి పెద్ద‌ కార‌ణమే ఉంది. మార్గరెట్‌ బోమెర్‌ అనే గర్భిణి టెక్సాస్‌లోని ఓ ఆసుప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంది. 16 వారాల గర్భంతో ఉన్న ఆ మ‌హిళ క‌డుపులో ఉన్న శిశువు వెన్నెముకకు కణితి పెరుగుతున్నట్లు ప‌రీక్ష‌ల్లో తేలింది. అయితే, గ‌ర్భంలో ఉన్న ఆ శిశువుతో పాటు క‌ణితి ప‌రిమాణం కూడా పెరుగుతూ వ‌చ్చి శిశువుకి ప్రాణాపాయం తెచ్చిపెట్టేలా త‌యారైంది. ఆ మ‌హిళ‌కు 23 వారాల గర్భం సమయంలో కణితి ఆ శిశువు కంటే పెద్దగా అయిపోయింది. దాన్ని శ‌స్త్ర‌చికిత్స చేసి తొలగిస్తే తప్ప ఆ శిశువు బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో మ‌రో ఐదురోజుల‌కి వైద్యులు బోమెర్‌కు అత్యవసరంగా ఆప‌రేష‌న్ చేశారు. శిశువుని త‌ల్లి గర్భంలో నుంచి బయటకు తీసి కణితి తొలగించారు. అనంత‌రం మళ్లీ తల్లి కడుపులో ప్రవేశపెట్టి, గర్భసంచికి కుట్లువేశారు. డాక్టర్లు ఈ ఆప‌రేష‌న్ జ‌రిపిన 12 వారాల తర్వాత ఈ ఏడాది జూన్‌లో సిజేరియన్‌ ద్వారా ఆ మ‌హిళ‌కు ఆ పండంటి పాప పుట్టింది. ఈ పాప పేరు లైన్లీ హోప్ అని పెట్టారు. రెండు సార్లు అమ్మ‌క‌డుపులోంచి రావ‌డం అద్భుత‌మే కదా!

  • Loading...

More Telugu News