: మనమంతా హోదా కోసమే పోరాడదాం.. జగన్ అన్ననే వచ్చే ఎన్నికల్లో గెలిపిద్దాం: కర్నూలు యువభేరిలో ఓ విద్యార్థిని
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు కర్నూలు జిల్లా గుత్తి రోడ్డులోని వీజేఆర్ ఫంక్షన్ హాల్లో యువభేరి నిర్వహిస్తున్నారు. హోదాతో రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలను ఆయన వివరిస్తూ అక్కడికి వచ్చిన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ... హోదా రాకపోతే ఎంతో నష్టపోతామని చెప్పింది. ‘మనమంతా హోదా కోసమే పోరాడదాం.. జగన్ అన్ననే వచ్చే ఎన్నికల్లో గెలిపిద్దాం’ అని వ్యాఖ్యానించింది. మరో విద్యార్థి మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తీరు బయటపడిందని చెప్పాడు. దీనికి జగన్ స్పందిస్తూ... దేశ చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్రలోనే ఇటువంటి ఘటన ఇక్కడ ఒక్కచోటే జరిగిందని అన్నారు. అడ్డంగా దొరికిపోయినా కూడా చంద్రబాబు అందరినీ మేనేజ్ చేసుకోగలరని ఆయన వ్యాఖ్యానించారు. మరో విద్యార్థిని మాట్లాడుతూ... ప్రత్యేక ప్యాకేజీ అంశం ముఖ్యమంత్రి ఒక్కరికే నచ్చితే సరిపోతుందా? అని ప్రశ్నించింది. ఐదు కోట్ల మంది ప్రజలకు ఆమోదం అవసరం లేదా? అని అడిగింది. దీనికి జగన్ సమాధానం చెబుతూ... ప్యాకేజ్ అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా మద్దతు తెలపాలని, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు ఒక్కరే దానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటన చేశారని అన్నారు. మరో విద్యార్థి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం పోరాడితే విద్యార్థులను జైలులో పెడతా మంటున్నారని, అయినా తాము హోదా కోసం పోరాడతామని అన్నాడు. ఓ విద్యార్థి ఉద్వేగపూరితంగా ప్రత్యేక హోదా కోసం మా ప్రాణాలయినా ఇస్తామని అన్నాడు.