: ఇక ఆంధ్రా వంతు.. 60 మినీ జిల్లాలకు సర్కారు కసరత్తు.. ‘బాబు’ ప్రయోగం!


పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం జిల్లాల సంఖ్యను ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ఏపీ సర్కారు కూడా తలమునకలైంది. అయితే జిల్లాలను విభజించకుండానే ఆ పని చేయాలని భావిస్తోంది. మొత్తంగా 60 మినీ జిల్లాలుగా రాష్ట్రాన్ని విభజించి పాలనను వికేంద్రీకరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాచరణ రూపొందిస్తున్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించాలని భావిస్తున్నారు. సర్కారు సరికొత్త నిర్ణయంతో ఆర్డీవోల పాత్ర మరింత విస్తృతం కానుంది. ఇంచుమించుగా కలెక్టర్‌లానే అన్ని పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల తీరును రెవెన్యూ డివిజన్లలో పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాల్లో అధికశాతం రెవెన్యూ డివిజన్లలోనే జరిగిపోవాలనేది సీఎం ఆలోచనగా చెబుతున్నారు. అలాగే పోలీసు శాఖలో డీఎస్పీ పరిధిని ఆర్డీవోకు సమానంగా మార్చాలని నిర్ణయించారు. డీఎస్పీల స్థాయిని పెంచి ఎస్పీల అధికారాల్లో కొన్నింటిని వారికి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ స్థాయి అధికారుల్లో సమర్థులను ఎంపిక చేసి వారిని ఆర్డీవోలు, డీఎస్పీలుగా నియమించాలని యోచిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో వీరి పాత్రను కీలకం చేయనున్నారు. త్వరలోనే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జిల్లాను ఏమాత్రం విభజించకుండానే పరిపాలనను వికేంద్రీకరించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని పలువురు సమర్థిస్తున్నారు.

  • Loading...

More Telugu News