: ఎల్వోసీకి, నవాజ్ షరీఫ్ కి ఏమైనా సంబంధం ఉందా?... ఒత్తిడి పెరిగిన ప్రతిసారీ ఎల్వోసీ వద్ద ఉద్రిక్తత పెరుగుతోంది: ఇమ్రాన్ ఖాన్


పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై ఒత్తిడి పెరిగిన ప్రతిసారీ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతలు ఎందుకు తలెత్తుతాయని పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు. ఇస్లామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, నవాజ్ ష‌రీఫ్ దేశానికి అతిపెద్ద భ‌ద్ర‌తా స‌మ‌స్య‌గా మారారని అన్నారు. పాక్ ఆర్మీని ప్ర‌ధాని ష‌రీఫ్ వేరు చేస్తున్నార‌ని ఆయన ఆరోపించారు. అవినీతి ఆరోప‌ణ‌ల నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు షరీఫ్, ఇండో-ఇజ్రాయిల్ లాబీని వాడుకుంటున్నార‌ని ఆయన ఆరోపించారు. నియంత్ర‌ణ రేఖ‌కు, న‌వాజ్ ష‌రీఫ్‌ కు ప‌రోక్ష సంబంధం ఉంద‌ని చెప్పిన ఆయన, నవాజ్ పై ఒత్తిడి పెరిగిన ప్రతిసారీ నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తత పెరుగుతుందని పేర్కొన్నారు. కాగా నవంబర్ 2న పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ ఇస్లామాబాద్‌ ను స్తంభింప‌చేయాల‌ని ఆయన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళనకారుల్ని అడ్డుకునేందుకు నవాజ్ సర్కార్ సిద్ధమవుతోంది. నిర‌సన‌కారుల‌ను త‌రిమికొట్టేందుకు 6800 ర‌బ్బ‌ర్ బుల్లెట్లు కావాలంటూ పోలీసులు అధికారుల‌ను కోరిన‌ట్లు స‌మాచారం. ర‌బ్బ‌ర్ బుల్లెట్ల‌తో పాటు ప‌ది వేల టియ‌ర్ గ్యాస్ షెల్స్‌, 300 షిప్పింగ్ కంటైన‌ర్లు, 1500 లాఠీలు, 2 వేల అద‌న‌పు బ‌ల‌గాలు కావాల‌ని పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. ఇస్లామాబాద్‌ వరకు రాజ‌కీయ కార్య‌క‌ర్త‌లను రాకుండా అడ్డుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. దీంతో నవంబర్ 2న ఇస్లామాబాద్ రణరంగంగా మారనుందన్న సూచనలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News