: రెండేళ్లలో 800 మందిని పట్టుకున్న షీ టీమ్స్
2014 అక్టోబర్ 24న 100 షీ టీమ్స్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అప్పటి నుంచి షీటీమ్స్ హైదరాబాదులో మహిళల రక్షణకు ఎన్నో చర్యలు చేపట్టాయి. బస్సుల్లో సపరేట్ సీట్లు ఏర్పాటు చేయడం దగ్గర్నుంచి, యాప్ దారా సమస్యలు పరిష్కరించడం... ఇలా ఎన్నో రకాలుగా షీ టీమ్స్ బృందాలు సేవలందిస్తున్నాయి. ఈ బృందాల ఏర్పాటుతో 20శాతం మేర కేసులు తగ్గుముఖం పట్టాయని సీపీ స్వాతి లాక్రా తెలిపారు. ఈ రెండేళ్లలో షీ టీమ్స్ మహిళల్ని వేధిస్తున్న 800 మంది ఆకతాయిల్ని పట్టుకున్నాయని ఆమె చెప్పారు. వారిలో 41 మందిని జైలుకి పంపామని, 242 మందికి అపరాధ రుసుం విధించినట్టు తెలిపారు. మరో 392 మందిని తొలి తప్పుగా హెచ్చరించి వదిలిపెట్టినట్టు చెప్పారు. ఇలా ఈ రెండేళ్లలో మొత్తం 2,362 ఫిర్యాదులందుకోగా, డయల్ 100 ద్వారా 1217 ఫిర్యాదులు, ఫేస్ బుక్ ద్వారా 322 ఫిర్యాదులు, ఈ-మెయిల్ ద్వారా 183 ఫిర్యాదులు, నేరుగా 421 ఫిర్యాదులు, వాట్స్ యాప్ ద్వారా 175 ఫిర్యాదులు, హ్యాక్ ఐ మొబైల్ అప్లికేషన్ ద్వారా 44 ఫిర్యాదులు తీసుకున్నట్టు ఆమె తెలిపారు.