: ఈ ఊయ‌ల‌ తొట్టెలో పసిపిల్లలను పడుకోబెడితే ఒక్క నిమిషంలో హాయిగా నిద్రలోకి జారుకుంటారు!


ఒక్కోసారి పసి పిల్లల ఏడుపు ఆప‌డం ఎవ‌రిత‌రం కాదు. నిద్రపోకుండా అల్ల‌రి చేస్తూ ఇంట్లో ఉన్న వారికి విసుగు తెప్పిస్తుంటారు. 'జో.. జో' అంటూ ఎన్ని లాలి పాట‌లు పాడినా ఒక్కోసారి కొంద‌రు పిల్ల‌లు నిద్ర‌లోకి జారుకోరు. అటువంటి పిల్ల‌లు హాయిగా నిద్ర‌పోవ‌డానికి అమెరికాలోని మస్సాచుసెట్స్‌ విశ్వవిద్యాలయ (యంఐటీ) ఇంజినీర్లు ఓ ఊయ‌ల తొట్టెను క‌నిపెట్టారు. ఇది మామూలు ఊయ‌ల కాదు. ఏడుస్తున్న పిల్లల్ని అందులో పడుకోబెడితే వారు ఒక నిమిషంలో ఏడుపు ఆపేయ‌డ‌మే కాకుండా హాయిగా నిద్రపోతారు. మస్సాచుసెట్స్‌ విశ్వవిద్యాలయం 2002 నుంచి ఇటువంటి ఊయ‌ల‌ను క‌నిపెట్ట‌డానికే ఎన్నో ప్ర‌యోగాలు చేస్తోంది. తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు ఇబ్బంది క‌లిగేలా ఉండే పిల్లల ఏడుపును ఆపే దిశగా వారు ప్రయోగాలు కొన‌సాగిస్తున్నారు. వారి ఆలోచ‌న‌ల ఫ‌లితంగా ఈ ‘స్మార్ట్‌ క్రిబ్‌’ అనే ఊయ‌ల‌ తొట్టె తయారయింది. పిల్లల్ని అందులో పడుకోబెట్టిన వెంటనే వారు నిద్ర‌లోకి జారిపోవ‌డానికి గ‌ల కార‌ణాన్ని వివ‌రిస్తూ... తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలాంటి ధ్వనులు వస్తాయో అటువంటి ధ్వనులే ఈ తొట్టెలోనూ వినిపిస్తాయని దీనిని త‌యారు చేసిన‌ ఇంజినీర్లు తెలిపారు. చిన్నారులు నిద్రలోకి జారుకోవ‌డానికి కావాల్సిన వాతావరణం ఈ తొట్టెలో ఉంటుంద‌ని తెలిపారు. చిన్నారుల కదలికలను గుర్తించేందుకు తాము అందులో సెన్సార్లు అమర్చిన‌ట్లు చెప్పారు. ఈ తొట్టె ఉండే ఆకృతి కూడా ప‌సి పిల్ల‌ల‌కి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. అందులో ఉన్న సౌక‌ర్యాలతో ఏడ్చే చిన్నారులను అందులో వేస్తే ఏడుపు ఆపేసి మ‌త్తుగా నిద్రపోతారని చెప్పారు. స్మార్ట్‌ క్రిబ్ ను తాము ప్రయోగాత్మకంగా 200 మంది పిల్లలపై ప్ర‌యోగించిన‌ట్లు పేర్కొన్నారు. త‌మ ప‌రిశోధ‌న‌ల్లో ఈ తొట్టెతో చక్కని ఫలితం కనిపించినట్లు పేర్కొన్నారు. దీని ధ‌ర‌ రూ. 77,620 గా ఉంది. చిన్నారుల ఏడుపుతో విసిగిపోతోన్న వారికి ఈ ఊయ‌ల తొట్టే చ‌క్క‌ని ప‌రిష్కారంగా క‌న‌ప‌డుతోంది.

  • Loading...

More Telugu News