: ఆ నేరం నాది కాదన్నా ఎవరూ వినిపించుకోలేదు.. తప్పు చేయని నేరానికి 46 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు!


వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు... కానీ, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అంటుంటారు. కానీ, కొన్నిసార్లు నిర్దోషులు కూడా శిక్షలు అనుభవించాల్సి వస్తుంటుంది. ఇదే రీతిలో, సరైన సాక్ష్యాధారాలను సమర్పించలేక ఓ అమాయకుడు 46 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాడు. యువకుడిగా ఉన్న వయసులో కటకటాల వెనక్కి వెళ్లి, ముసలి వయసులో బయటకు వచ్చాడు. వివరాల్లోకి వెళ్తే, ఓ వివాహితపై అత్యాచారం చేసి, ఆమె నాలుగేళ్ల కుమారుడిని కిరాతకంగా చంపినట్టు వచ్చిన ఆరోపణలతో, వర్జీనియాకు చెందిన షెర్మీన్ బ్రౌన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 1970లో ఈ ఘటన జరిగింది. అప్పట్లో బ్రౌన్ వయసు 22 ఏళ్లు. వాస్తవానికి ఆ నేరానికి, బ్రౌన్ కు ఎలాంటి సంబంధం లేదు. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు తాను నిర్దోషినని నిరూపించుకునే ప్రయత్నాన్ని అతను చేస్తూనే ఉన్నాడు. కానీ, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో తాను నిర్దోషినని నిరూపించుకోలేకపోయాడు. దీంతో, గత 46 ఏళ్లుగా అతను జైల్లోనే మగ్గిపోయాడు. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... కేసుకు సంబంధించిన డీఎన్ఏ నమూనాలను పరిశీలించాలని ఆదేశించింది. దీంతో, వాస్తవం వెలుగు చూసింది. అత్యాచారానికి, హత్యకు, బ్రౌన్ కు ఏ సంబంధం లేదని డీఎన్ఏ రిపోర్టులో వెల్లడైంది. దీంతో, చేయని తప్పుకు 46 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న షెర్మాన్ బ్రౌన్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాడు.

  • Loading...

More Telugu News