: సోనాక్షి తలచుకుంటే ఏమైనా చేయగలదు: జాన్ అబ్రహాం
సోనాక్షి సిన్హాతో నటించడం చాలా కంఫర్ట్ గా ఉంటుందని బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహాం అన్నాడు. 'ఫోర్స్ 2' సినిమాలో జాన్ అబ్రహాంకు జంటగా సోనాక్షి నటిస్తోంది. షూటింగ్ కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ, సోనాక్షిపై జాన్ అబ్రహాం ప్రశంసలు కురిపించాడు. సినిమా షూటింగ్ మొదలైన రెండో రోజున తామిద్దరం కలసి ఓ యాక్షన్ సన్నివేశంలో పాల్గొనాల్సి ఉందని... ఆ సీన్ లో ఓ పేలుడు నుంచి తప్పించుకుంటూ తాము దూకాల్సి ఉందని... అయితే, సోనాక్షి ఎలా చేస్తుందో అని తాను కంగారుపడ్డానని... కానీ, ఏ మాత్రం భయం లేకుండా సోనాక్షి ఈజీగా దూకేసిందని జాన్ చెప్పాడు. సోనాక్షి తలచుకుంటే ఏమైనా చేయగలదనే విషయం తనకు అప్పుడే అర్థమైందని అన్నాడు. ఆ ఒక్క సీన్ లోనే కాకుండా, షూటింగ్ జరుగుతున్న రోజుల్లో ఫలానా సన్నవేశం కష్టంగా ఉందని ఆమె ఎన్నడూ చెప్పలేదని తెలిపాడు. ఎలాంటి యాక్షన్ ఫీట్లనైనా ఆమె చాలా సులువుగా చేసేస్తోందని అన్నాడు. సోనాక్షిని చూసిన తర్వాత, యాక్షన్ సన్నివేశాల్లో హీరోయిన్లకు కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుందని తనకు అనిపించిందని జాన్ చెప్పాడు.