: అమెరికా, యూరప్ ప్రాంతాల్లో జరిగిన సైబర్ దాడిపై తప్పు ఒప్పుకున్న చైనా సంస్థ
అమెరికా, యూరప్ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన సైబర్‌దాడి అలజడి రేపిన సంగతి తెలిసిందే. ఈ దాడి చేసిన వ్యక్తులు తమ టెక్నాలజీనే వాడుకున్నట్టు చైనా సంస్థ ‘హాంగ్జూ జియాంగ్ మయి’ తెలిపింది. నిఘా వీడియో కెమెరాల విడిభాగాలు ఉత్పత్తిచేసే సదరు చైనా సంస్థ ఓ ప్రకటన విడుదల చేస్తూ సైబర్ దాడికి గురయిన ట్విట్టర్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, టంబ్లర్ లాంటి వందల ప్రముఖ వెబ్ సైట్లను హ్యాకింగ్‌కు గురిచేయడానికి ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌ను గురించి తెలిపింది. 'మిరాయ్' సాఫ్ట్ వేర్ లోని మాల్‌వేర్‌ను హ్యాకర్లు ఉపయోగించారని స్పష్టం చేసింది. తాము అజాగ్రత్తగా వ్యవహరించడం వల్లే తమ సంస్థ రూపొందించిన సీసీ టీవీల ద్వారా ఈ దాడి జరిగినట్టు హాంగ్జూ జియాంగ్ మయి తేల్చిచెప్పింది. మిరాయ్ సాఫ్ట్ వేర్ అతి పెద్ద విధ్వంసకారి అని ఆ సంస్థ పేర్కొంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తూ హ్యాకర్లు తమకు కూడా ఇబ్బందులు కలిగించారని చెప్పింది. డిఫాల్ట్ పాస్ వర్డ్ ని మార్చుకోని డివైస్ లపై మాల్‌వేర్‌తో ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొంది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్‌లలో హ్యాకర్లు చొరబడ్డారని చెప్పింది. ఈ అంశాన్ని తాము గత సంవత్సరమే గుర్తించినట్లు పేర్కొంది. అప్పటినుంచి హ్యాకర్లు తమపై సైబర్ దాడి చేస్తూనే ఉన్నారని తెలిపింది. గతేడాది సెప్టెంబర్ నెల తరువాత తాము రూపొందించిన కెమెరాలలో ఈ లోపాన్ని గుర్తించినట్లు పేర్కొంది. తమ యూజర్లు తాము నూతనంగా రూపొందించిన సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసుకోవాలని తెలిపింది. మిరాయ్ ప్రోగ్రాం కోడ్ ను గత నెల క్రితమే అంతర్జాలంలో ఉంచినట్లు పేర్కొన్నారు. ఆ కోడ్ ద్వారానే సైబర్ దాడులు చేయగలిగారని చెప్పింది. హ్యాకర్లు సమాచారాన్ని దొంగిలించే ఈమెయిల్స్(ఫిషింగ్ మెయిల్స్)లోని కంప్యూటర్ లేదా నెట్‌వర్క్‌లపై దాడి చేస్తారని, తరువాత డిజిటల్ వీడియో రికార్డర్లు(డీవీఆర్), కేబుల్ సెట్ టాప్ బాక్సులు, రూటర్లు, వెబ్ కెమెరాలకు వైరస్ వ్యాపింపజేస్తారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. తాజాగా ఆయా దేశాల్లో జరిగిన సైబర్ దాడి ఇలానే జరిగిందని చెప్పారు.