: నాలుగున్నరేళ్లుగా అఖిలేశ్ ను అణచివేసేందుకు కుట్రలు జరిగాయి: రాంగోపాల్ యాదవ్ కుమారుడు
సమాజ్ వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాంగోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ కు మద్దతుగా ఆయన లేఖాస్త్రం సంధించారు. అఖిలేశ్ కు వ్యతిరేకంగా శివపాల్ యాదవ్ కొనసాగించిన కుట్రను లేఖలో వివరించారు. పార్టీలో పుట్టిన ముసలానికి శివపాలే కారణం అని తేల్చి చెప్పారు. 2012లో యూపీ ముఖ్యమంత్రి కావడానికి శివపాల్ విశ్వప్రయత్నం చేశారని... అఖిలేశ్ కు ఆ పదవి దక్కకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఆ తర్వాత అఖిలేశ్ ను మానసికంగా హింసించారని, దారుణంగా అవమానించారని తెలిపారు. గత నాలుగున్నరేళ్లుగా అఖిలేశ్ ను అణచివేసేందుకు కుట్రలు పన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ కు తన తండ్రి రాంగోపాల్ దగ్గర కావడాన్ని శివపాల్ జీర్ణించుకోలేకపోయారని... బీజేపీకి రాంగోపాల్ దగ్గరయ్యాడంటూ అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. వాస్తవానికి, బీజేపీతో దగ్గర సంబంధాలు పెట్టుకున్నది శివపాలే అని అన్నారు. గత జూలైలో ఒక బీజేపీ ఎంపీతో కలిసి ఆ పార్టీ అగ్రనేతను శివపాల్ కలిశారనే దానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని బాంబు పేల్చారు.