: ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఆస్ట్రేలియా శునకం.. యాడ్స్ కోసం క్యూ కడుతున్న కంపెనీలు
నల్లని రంగులో మెరిసిపోతున్న ఓ సొగసైన ఆస్ట్రేలియా శునకం ఇప్పుడు ఇంటర్నెట్ స్టార్‌గా మారిపోయింది. దాని అందానికి ముగ్ధులైన ఎంతోమంది డానికి అభిమానులుగా మారిపోయారు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ శునకరాజం పేరు ‘టీ’. ఆఫ్గాన్‌హౌండ్ జాతికి చెందినది. కిందకు జారే నల్లని బొచ్చుతో ముద్దొస్తున్న శునకం ఫొటోలను దాని యజమాని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అంతే, కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయాయి. చక్కర్ల మీద చక్కర్లు కొడుతూ ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను ఏలేస్తున్నాయి. ఈ ఫొటోలను చూసిన యాడ్ కంపెనీలు ‘టీ’ని తమ యాడ్స్ కోసం వాడుకునేందుకు పోటీ పడుతున్నాయి. యజమాని ల్యూక్ కవనాగ్ ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఈ శునకం ప్రముఖ శునక ఆహార కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఇక తన శునకానికి వచ్చిన సెలిబ్రిటీ హోదాను చూసి యజమాని ల్యూక్ ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు.