: నేను కంటతడి పెట్టని రోజు లేదు.. ఇంకెంత కాలం ఈ జైలు జీవితం?.. రాజీవ్ హత్య కేసు దోషి నళిని ఆవేదన


‘‘రోజురోజుకు ఆశలు అడుగంటిపోతున్నాయి. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నా. నేను కంటతడి పెట్టని రోజు లేదు. విడుదల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా. రోజులు వస్తున్నాయి. పోతున్నాయి. నాకు మాత్రం విడుదల లభించడం లేదు. అసలు ఏనాటికైనా నేను విడుదలయ్యే అవకాశం ఉందా?’’ అంటూ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీ డబ్ల్యూ)కు రేఖ రాసింది. తనను విడిచిపెట్టేందుకు చొరవ తీసుకోవాలని అభ్యర్థించింది. ఈ విషయాన్ని నళిని అడ్వకేట్ పి.పుగాఝెంతి ఆదివారం మీడియాకు తెలిపారు. నళిని చాలా కాలంగా జైలులో మగ్గుతోందని, రాజ్యాంగపరంగా ఆమెకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఉంటే ఆమె ఈపాటికే విడుదలై ఉండేదని ఆయన పేర్కొన్నారు. జాతీయ మహిళా కమిషన్ చొరవతో 2000 సంవత్సరంలోనే నళిని ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చారన్నారు. నళిని రాసిన లేఖలో ఏముందంటే.. ‘నేను 25 ఏళ్లుగా జైలులో ఉన్నా. సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవిస్తున్న మహిళను బహుశా నేనేనేమో. నేను కంటతడి పెట్టని రోజు లేదు. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నా వంటి వారి జయంతులు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ నేను మాత్రం విడుదలకు నోచుకోవడం లేదు. వందలాది మంది మహిళా ఖైదీలు విడుదలవుతున్నారు. నాకు మాత్రం ఆ అదృష్టం కలగడం లేదు. జైలు నుంచి విడుదలవుతానన్న ఆశలు ఆవిరవుతున్నాయి. బ్రిటన్‌లో ఉన్న నా కుమార్తెను నేను చూడగలన్న నమ్మకం కూడా లేదు. ఆమెకు నేను పెళ్లి చేయగలనో, లేదో కాలమే చెప్పాలి’’ అని లేఖలో పేర్కొంది. కాగా మహిళా కమిషన్‌కు నళిని రేఖ రాయడం ఈ నెలలో ఇది రెండోసారి కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News