: సినీ రంగంలో నిలదొక్కుకోవడం కష్టమంటూ ఇంట్లో వాళ్లు హితబోధ చేసేవారు!: అమీర్ ఖాన్
సినీ రంగంలో నిలదొక్కుకోవడం కష్టమని చెప్పి, తాను సినిమాల్లోకి వస్తానంటే వద్దంటూ తన కుటుంబసభ్యులు తనకు హితబోధ చేస్తుండే వాళ్లను బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. తనను ఇంజనీర్ గా చూడాలని తమ కుటుంబం కోరుకునేదని అన్నారు. అయితే, తన తండ్రి తాహిర్ హుస్సేన్ పెద్ద దర్శకుడు కావడంతో, సినిమా వాతావరణమే తమ ఇంటి నిండా ఉండేదని, ఇటువంటి పరిస్థితుల్లో తనకు కూడా సినిమాలపైనే ఆసక్తి ఉండేదని, నటించాలనిపించేదని అమీర్ అన్నారు. అయితే, సినీ రంగంలో నిలదొక్కుకోవడం అంత తేలికైన విషయం కాదని, జీవితానికి భరోసా ఇవ్వగలిగే వృత్తిని ఎంచుకోవాలని తమ కుటుంబసభ్యులు చెబుతుండే వారని చెప్పారు. అయితే, సినిమాల్లో నటించాలనే తపనతో, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్ టీ ఐ ఐ)లో చేరి నటనలో శిక్షణ తీసుకున్నానని అన్నారు. తనకు సినిమా అవకాశాలు ఇప్పించాల్సిన బాధ్యత తన తండ్రిదేనని తాను ఎప్పుడూ అనుకోలేదని, వారికి తానెప్పుడూ భారం కాకూడదనే విషయం ఎప్పుడూ తన మైండ్ లో ఉండేదంటూ నాటి విషయాలను అమీర్ ఖాన్ గుర్తు చేసుకున్నారు.