: ఐపీఎల్ వల్ల ఆస్ట్రేలియా క్రికెట్ నాశనమైంది: స్టీవ్ వా సంచలన విమర్శ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వల్ల ఆస్ట్రేలియా క్రికెట్ వైఫల్యాల బాటలో నడుస్తూ నాశనమవుతోందని దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ వా సంచల విమర్శలు చేశాడు. టెస్టులతో పాటు వన్డేల్లో ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆస్ట్రేలియా, ఇటీవలి కాలంలో వైట్ వాష్ లకు గురవుతుండటాన్ని విశ్లేషించిన ఆయన, ఐపీఎల్ లో ఆడుతున్న కారణంగా ఆటగాళ్లు అలసటకు గురవుతూ, తరువాతి షెడ్యూళ్లలో పూర్తి స్థాయి ప్రదర్శనను కనబరచలేక పోతున్నారని విమర్శించాడు. రెండు నెలల క్రితం లంకతో 3-0తో, ఆపై ఇటీవల దక్షిణాఫ్రికాలో ఐదు వన్డేల సిరీస్ ను 5-0తో ఓడిపోవడం తనను బాధించిందని పేర్కొన్నాడు. తాము క్లబ్ క్రికెట్ లో ఆడిన సమయంలో ఈ తరహా వాతావరణం లేదని, ఇప్పుడు కాంపిటీషన్ తో పాటు, ఆటగాళ్లు గాయాల పాలయ్యే అవకాశాలూ పెరిగాయని అన్నాడు. కాగా, వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇండియాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే.