: గత ప్రభుత్వాలకు దూరదృష్టి లేకనే ఈ దుస్థితి: విమానయాన రంగంపై ప్రధాని మోదీ
మరిన్ని ప్రాంతాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేసి, రీజనల్ కనెక్టివిటీని పెంచడం ద్వారా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పౌరవిమానయాన పరిశ్రమ స్థాయికి ఇండియా చేరుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు విమానయాన రంగం అభివృద్ధిపై దృష్టిని సారించలేదని, వారికి దూరదృష్టి లేకపోవడంతోనే విస్తరణ ఆగిపోయిందని ఆయన ఆరోపించారు. వడోదరాలో హరిత విమానాశ్రయ టర్మినల్ భవనాన్ని జాతికి అంకితం చేసిన తరువాత ఆయన మాట్లాడారు. ఇండియాలో కెల్లా రెండో గ్రీన్ ఎయిర్ పోర్టు వడోదరలోనే ఉందని గుర్తు చేశారు. సమీప భవిష్యత్తులో ఇండియాలో విమాన ప్రయాణం మధ్యతరగతికి అందుబాటులోకి రానుందని అన్నారు. ఇండియా చాలా పెద్ద దేశమని, 80 నుంచి 100 విమానాశ్రయాలు సరిపోతాయని భావించరాదని అన్నారు. టైర్-2, టైర్-3 పట్టణాల్లో సైతం విమానాశ్రయాలు నిర్మించాలని భావిస్తున్నామని తెలిపారు. దేశంలో నిరుపయోగంగా ఉన్న రన్ వేలనూ ఉపయోగంలోకి తీసుకు వచ్చేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించినట్టు మోదీ పేర్కొన్నారు.