: సరిహద్దులో పాక్ రేంజర్లను బీఎస్ఎఫ్ హతమార్చిన వీడియో విడుదల
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా హిరానగర్ సెక్టార్‌లో నిన్న భారత ఔట్‌పోస్ట్‌లపై పాక్ రేంజర్లు జరిపిన దాడులను ఎదుర్కొన్న భారత బలగాలు ఆరుగురిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన థర్మల్ ఇమేజెస్‌ను ఈ రోజు బీఎస్ఎఫ్ అధికారులు విడుదల చేశారు. బీఎస్ఎఫ్ ఔట్‌పోస్ట్‌లపై పాక్ రేంజర్లు బాంబులు విసురుతుండగా ఆ దృశ్యాలు అందులో నిక్షిప్తమయ్యాయి. అనంతరం భారత జవానులు జరిపిన కాల్పుల నుంచి తప్పించుకోవడానికి రేంజర్లు ప్రయత్నాలు జరిపారు. వారిని గమనించిన జవాన్లు ప్రతిదాడులు జరిపి వారిపై దాడులు చేశారు. ఈ ఘటన నిన్న ఉదయం 9.35 గంటల సమయంలో చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం ఏడుగురు పాక్ రేంజర్లు తాము జరిపిన ప్రతిదాడిలో మృతి చెందారని చెప్పారు. దాడిలో మరో ఉగ్రవాది కూడా మరణించాడని పేర్కొన్నారు. పాక్ రేంజర్ల కాల్పుల్లో గాయపడ్డ బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ గుర్నామ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.