: రష్యాలో కూలిన హెలికాఫ్టర్... 21 మంది దుర్మరణం
ప్రమాదవశాత్తు ఓ హెలికాప్టర్ కూలడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన రష్యాలో చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. క్రస్నోయార్క్ రీజియన్ నుంచి ఉరెంగోయ్ వెళుతున్న ఎంఐ-8 హెలికాప్టర్ ఈ ప్రమాదానికి గురైంది. సైబీరియా యమల్ ద్వీపకల్పంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు ప్రతికూల వాతావరణమే కారణమని తెలుస్తోంది. ఘటనా స్థలిలో డేటా రికార్డర్, వాయిస్ రికార్డుల బ్లాక్ బాక్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలను కనిపెట్టేందుకు ఈ బ్లాక్ బాక్సులను పరిశీలించాల్సి ఉందని చెప్పారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో 22మంది ప్రయాణికులు, ముగ్గురు విమాన సిబ్బంది ఉన్నారని తెలిపారు.