: జేమ్స్ బాండ్ పియర్స్ బ్రోస్నన్ పై కేసు వేసే ఆలోచనలో పాన్ బహార్
పాన్ మసాలా సంస్థ పాన్ బహార్ యాడ్ లో నటించిన జేమ్స్ బాండ్ ప్రియర్స్ బ్రోస్నన్ పై విమర్శల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. పొగాకు ఉత్పత్తులకు జేమ్స్ బాండ్ ప్రచారం చేయడం ఏమిటా? అని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, పియర్స్ బ్రోస్నన్ వివరణ ఇచ్చాడు. అది హానికరమైనదని తనకు తెలియదని... టూత్ వైట్నర్ అన్న ఉద్దేశంతోనే తాను ప్రమోట్ చేయడానికి ఒప్పుకున్నానని తెలిపాడు. అయితే తనకు తెలియకుండానే తన ఫొటోను పొగాకు ఉత్పత్తులకు పాన్ బహార్ అనధికారికంగా వినియోగించిందని చెప్పాడు. దీనిపై పాన్ బహార్ కంపెనీ యజమాని దినేష్ జైన్ స్పందించారు. అన్ని విషయాలను బ్రోస్నన్ కు వివరించామని... కాంట్రాక్ట్ ప్రకారమే బాండ్ తో యాడ్ ను చిత్రీకరించామని ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. తమ ప్రాడక్టులో పొగాకు లేదని... అది కేవలం మౌత్ ఫ్రెష్నర్ మాత్రమే అని చెప్పారు. తమ కాంట్రక్టు నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్న బ్రోస్నన్ పై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నామని తెలిపారు.